25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జాక్ ఫ్రూట్ తో జాక్పాట్

 పెరుగుతున్న ఖర్చులు ఒకవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరొకవైపు సంప్రదాయ సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళిస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన ముఖేష్ అనే రైతు సైతం గతంలో వరి ,గోధుమ సాగు చేసేవారు. 

 ఇబ్బందులతో సతమతమై పనస సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో సుమారు 35 పనస మొక్కలను నాటిన ముఖేష్ వీటి సాగుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. పూసా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లి పనస సాగు గురించి తెలుసుకున్నాను, సాధారణ రకానికి బదులుగా ఏడాది పొడవునా కాపునిచ్చే పనస రకాన్ని నా పొలంలో నాటాను. ఐదేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు ప్రతినెల క్వింటాళ్లకొద్దీ దిగుబడిని ఇస్తున్నాయి. ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుంది అని ముఖేష్ వివరించారు. 




ట్రాక్టర్ల పేర్లే.. పిల్లల పేర్లు

 ఆయన రైతు. వ్యవసాయమంటే ప్రాణం. ఈ రంగంలో మరింతగా రాణించాలని ట్రాక్టర్ కొన్నారు. వ్యవసాయ పనులు అన్నీ ట్రాక్టర్ తో చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ట్రాక్టర్ తీసుకున్న నాటి నుంచి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. దీంతో ఆయనకు ట్రాక్టర్ తో అనుబంధం బలపడింది. ఆ అభిమానంతో తన ముగ్గురు పిల్లలకు ట్రాక్టర్ల పేర్లే పెట్టుకున్నాడు ఆ రైతు. ఇది ట్రాక్టర్ పై ఆయనకున్న ప్రేమ తెలుపుతోంది. 



బీర్కూర్ మండలం బొమ్మన్ దేవన్ పల్లి గ్రామానికి చెందిన ఆకుల రాములుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు పిల్లలకు స్వరాజ్, మహీంద్రా, సోనాలికా అని ట్రాక్టర్ల పేర్లు పెట్టుకున్నాడు రాములు. అలా తన కుటుంబానికి ఆర్థిక బలాన్నిచ్చిన ట్రాక్టర్ల పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఆలోచన ఇలా వచ్చింది..

రాములు 1993 లో స్వరాజ్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు.ఆయనకు 8 ఎకరాల భూమి ఉంది. ట్రాక్టర్ సాయంతో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించాడు.ఆయన తన మొదటి కుమారుడి పేరు "స్వరాజ్" అని నామకరణం చేశాడు.  తర్వాత మహీంద్రా కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. తర్వాత ఆయనకు రెండో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి మహీంద్రా అని పేరు పెట్టాడు. ఆ తర్వాత సోనాలికా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అపుడు కూతురు పుట్టింది. ఆమెకు సోనాలికా అని నామకరణం చేశాడు. పిల్లలందరూ చక్కగా చదువులో రాణిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా ట్రాక్టర్ ఉపయోగిస్తున్నట్లు చెబుతూ , ఆ అభిమానంతోనే పిల్లలకు ట్రాక్టర్ల పేర్లు పెట్టుకున్నట్లు రాములు చెప్పారు. ట్రాక్టర్ తోనే పంటలు పండిస్తున్నానని, దుక్కి దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకు ట్రాక్టరే అన్ని రకాలుగా తనకు సహాయపడుతుందని , అందుకే ట్రాక్టర్ అంటే ఎంతో అభిమానం అని అంటాడు రాములు. 

21, సెప్టెంబర్ 2026, సోమవారం

రాష్ట్ర ఉత్తమ పట్టు రైతు గా.. రాగుల రాజు.



 పట్టు సాగులో అత్యధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలిచిన నంగునూరు మండలం ముండ్రాయి రైతు రాగుల రాజుకు రాష్ట్ర ఉత్తమ పట్టు రైతు అవార్డు లభించింది. కేంద్ర పట్టు పరిశ్రమ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర  మంత్రి గిరిరాజ్ సింగ్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా రైతు రాజు మాట్లాడుతూ కొన్నేళ్లుగా పట్టు పంట సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నానని చెప్పారు .రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా ఇటీవల అవార్డు అందుకున్నానని ఇప్పుడు కేంద్ర అవార్డు కూడా లభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాష, జాయింట్ డైరెక్టర్ జెడి లత తదితరులు పాల్గొన్నారు. 

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సాగునీటి సమస్య- ప్రిసిషన్ అగ్రికల్చర్

 వరి సాగుకు కొత్త విధానాన్ని కనుగొన్న ఐఐటి  మద్రాస్. తక్కువ నీటితో వరి చెరుకు పండించడమే   లక్ష్యం.

భారతీయ వరి సాగు పై జరిగిన ఒక వివరనాత్మక అధ్యయనం ప్రకారం.. ఒక కిలో బియ్యం పండించడానికి సగటు న 1500 నుండి 2000 లీటర్ల నీరు అవసరం. వర్షాల పై ఆధారపడకుండా భూగర్భ జలాలని విపరీతంగా తోడేసే పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ కిలో బియ్యానికి 2270 నుంచి 2672 లీటర్ల వరకు అవసరమవుతుంది. భారతదేశం ఉపయోగించే మొత్తం మంచినీటి లో దాదాపు 90 శాతం వ్యవసాయానికే ఖర్చవుతుంది. చెరకు పంటకు కూడా భూమి ఎప్పుడూ తడిగానే ఉండాలి. భారతదేశపు అత్యున్నత సాంకేతిక సంస్థలలో ఒకటైన ఐఐటీ మద్రాస్ లో ఒకరు ఈ సమస్య వైపు దృష్టి సారించారు. ఐఐటి  మద్రాస్ "ప్రిసిషన్ అగ్రికల్చర్ " అని పిలిచే విధానంపై దృష్టి సారిస్తున్నదని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. తక్కువ నీటిని ఉపయోగిస్తూ వరి, చేరుకు  వంటి పంటలను పండించడమే ఈ ఖచ్చితత్వ వ్యవసాయం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. 

"మిషన్ ప్రవర్తక్ " అనేది ఐఐటి మద్రాస్ సొంత టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ .సెన్సార్లు ,నెట్వర్క్, కంట్రోల్ సిస్టంలు దీని ప్రధాన రంగాలు .ఖచ్చితత్వ వ్యవసాయం రూపుదిద్దుకోవడానికి సరిగ్గా ఈ సాంకేతికలే అవసరం."ప్రిసిషన్ అగ్రికల్చర్ " కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఉపయోగించాలో కెనడా భాగస్వాములతో కలిసి ప్రవర్తక్ ఇప్పటికే ఉమ్మడి వర్క్ షాప్ లను నిర్వహించింది. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే ఒక్క మొక్కకు ఎంత అవసరమో అంతే ఇవ్వడం. ఒక బొట్టు కూడా ఎక్కువ ఇవ్వకపోవడం. ఆచరణలో మూడు అంశాలు కలిసి పనిచేస్తాయి. నేలలో పాతిపెట్టిన సెన్సార్లు తేమను కొలుస్తాయి, రైతు ఊహించి నీరు పెట్టడానికి బదులుగా ,పంటకు ఎప్పుడు దాహం వేస్తుందో నేలే చెబుతుంది. పొలమంతా నీటితో ముంచెత్తి వృధా చేయకుండా  ,మొక్క వేర్లకు ఎంత కావాలో అంతే కొలత ప్రకారం చుక్కల రూపంలో నీటిని అందిస్తుంది. పై నుండి నిఘా ఉంచే శాటిలైట్ లు ,డ్రోన్లు పొలంలో ఏ భాగం పైరు సరిగ్గా పెరగడం లేదో ముందే పసి గడుతాయి. వరి విషయానికి వస్తే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్  డ్రైయింగ్ అనే పద్ధతి ద్వారా అంటే పొలాన్ని ఎల్లప్పుడూ నీటిలో ఉంచకుండా ,నీరు పెట్టిన తర్వాత కొద్దిగా ఆరనివ్వడం ద్వారా దిగుబడి తగ్గకుండా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించ వచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు. మారుతున్న వాతావరణం , పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటలకు నీటి దాహం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఖచ్చితత్వ వ్యవసాయం అనేది భారత్ కు ఎంతో అవసరం. తగ్గిపోతున్న నీటి వనరులతో భవిష్యత్తులో భారత్ తనకు తాను ఆహారాన్ని అందించుకోగలదా లేదా అనే దానికి ఇది సమాధానం. 

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆయిల్ పామ్ తోటలో.. ఏ ఐ రోబో

 కృత్రిమ మేధ ఆధారిత యంత్ర పరికరాల పై పరిశోధన లు విస్తృతంగా చేస్తున్నట్లు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. డీ. రాజిరెడ్డి గారు తెలిపారు. రాజేంద్ర నగర్ లోని ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ లో ఇటీవల నాటిన నూతన ఆయిల్ పామ్ తోటలో అంతర పంటల వరుసల మార్కింగ్ కోసం ఏ ఐ రోబో ట్రయల్ రన్ ను గురు వారం విజయ వంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ తోటలో కూర గాయలు, పూలు వంటి అంతర పంటల సాగు ను యంత్రాల సహాయంతో విజయ వంతంగా సరి చేయడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. 

16, ఆగస్టు 2026, ఆదివారం

ఇది ఆకు కూరల జాతర..

 పాలకూర ,తోటకూర ,మెంతికూర ,పొన్నగంటి కూర ఇవన్నీ మనకు తెలిసిన ఆకుకూరలు. పొలాల్లో విత్తనాలు చల్లితే సాగుతాయి. కానీ విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండానే పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగే ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా పంట పొలాల్లో పెరిగే జొన్న చెంచాలి కూర, ఎలుక చెవుల కూర ,అడవి సోయకూర, తెల్ల గర్జల కూర, బంకటి కూర ,తడకదొబ్బుడు, పప్పు గునగ కూర ,ఉత్తరేణి ,తుమ్మి కూర ఇలాంటి ఎన్నో ఆకుకూరలు పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరుగుతుంటాయి.  తెలిసినవారు వీటిని బేషుగ్గా వండుకొని తింటారు .జహీరాబాద్రు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ కలుపు కూరలను పోషకాల గనులుగా భావించి తింటుంటారు. ఈ ప్రాంతంలోని పంట పొలాల్లో సహజ సిద్ధంగా లభించే 60కి పైగానే ఉన్న ఆకు కూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్ష చేయించగా వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయని తేలింది. ఈ ఆకుకూరల ప్రత్యేకతను చాటేందుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో" సాగు చేయని ఆకుకూరల పండుగను " ఏటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఆకుకూరలు వండే విధానం ,తినడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులతో తెలియజేస్తారు. జహీరాబాద్ మండలం దిడ్గి  గ్రామ శివారులోని డిడిఎస్ కేవీకే కేంద్రంలో ఆదివారం ఒక్కరోజు ఉత్సవం జరగనున్నది. ఈ క్రతువుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హాజరవుతారు. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, ఇవి అద్భుత ఔషధాలనీ డీ డీ ఎస్ మహిళా ప్రతినిధులు, మహిళా రైతులు పేర్కొంటున్నారు. 



పల్లెలో పాల పంపకం..

 పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి కుటుంబమూ పాల ప్యాకెట్ కొనుగోలు తప్పని సరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఊరిలో పాల ప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు. 

ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీ లోని పొటంలొద్ది ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ 50 కుటుంబాలే ఉన్నప్పటికీ 250 కి పైగా పశువులు,మేకలు ఉన్నాయి. ఈ పశు సంపద ను పాకలకే పరిమితం చేయకుండా వాటిని ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగనిస్తూ ఆప్యాయంగా చూసుకుంటారు ఆ గ్రామ వాసులు. వీటి నుండి ఎంత పాల దిగుబడి వచ్చినా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు తప్ప చుక్క కూడా మార్కెట్ లో విక్రయించరు.

పైగా ఈ పశువుల మూత్రం ,పేడతో స్వయంగా సేంద్రీయ ఎరువులను తయారు చేసుకొని ,పంటలు సాగు చేసుకుంటున్నామని ..తమ ఊరిలో కృత్రిమ ఎరువుల వాడకం తక్కువ అని గ్రామ పెద్ద గంగు తెలిపారు.

7 నిమిషాల్లోనే చెఱకు రసం శుద్ధి

 చెఱకు రసం శుద్ధి చేసే పరికరాన్ని ఆవిష్కరించిన ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ కు 20 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ఆంధ్రా షుగర్స్ జే ఎం డీ ముళ్ళపూడి నరేంద్ర నాథ్ మార్గ దర్శకత్వంలో పరికరాల అభివృద్ధి బృందం ఈ యంత్రాన్ని తయారు చేసింది. కేవలం 7 నిమిషాల్లోనే చెఱకు రసాన్ని శుద్ధి చేయడం దీని ప్రత్యేకత అని యాజమాన్యం తెలిపింది. 

24, మే 2026, ఆదివారం

చేపల పెంపకం పై మూడు రోజుల శిక్షణ శిక్షణ

 నేషనల్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈనెల 28 29 30 తేదీలలో మంచిర్యాలలో ఏర్పాటు..

మత్స్యకారులను రైతులను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 28 29 30 తేదీలలో మత్స్యకారులకు చేపల పెంపకం పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులను ఎంపిక చేశారు. మత్స్యకారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చేపల పెంపకం పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. చేపల పెంపకం ఉత్పాదకను ఎలా పెంచాలి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. వీటితోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొర్రమీను/స్నేక్ హెడ్ పెంపకం, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. జాతీయస్థాయి మత్సరంగ శాస్త్రవేత్తలు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారులు హాజరై మత్స్యకారులు రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు కోరారు.

తిరుపతిలో పాలేకర్ శిక్షణ శిబిరం

 ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఐదు రోజుల శిక్షణ శిబిరం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించనున్నారు.

ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ రైతు శిక్షణ శిబిరం జూన్ 10 నుండి 14వ తేదీ వరకు జరగనున్న ది. పాలేకర్ ఆంగ్ల ప్రసాద్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు డాక్టర్ గంగాధర్ విజయ్ రామ్, పారిశ్రామిక వేత్త రామలింగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని తిరుపతి చంద్రగిరి రోడ్ లోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.హాజరయ్యే రైతులకు హాస్టల్ హెచ్ లో వసతి కల్పించ నున్నారు. గ్రామ స్వరాజ్యం, విష ముక్త, రోగ ముక్త ఆహారోత్పత్తి లక్ష్యంగా సుభాష్ పాలేకర్ కృషి SPK పద్ధతిలో ఇమిడి ఉన్న అన్ని అంశాలపై పాలేకర్ రోజుకు 12 గంటల పాటు లోతుగా శిక్షణ ఇస్తారు.5 రోజులు భోజన,వసతికి 1500 రూపాయలు చెల్లిస్తే చాలు.ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పని సరి.

పూర్తి వివరాలకు 96669 11116,94924 84003,93475 78819 ఫోన్ నెంబర్ లలో సంప్రదించ ాలని తెలిపారు.

21, మే 2026, గురువారం

నిమ్మ దిగుబడి పెరగాలంటే

 వేసవికాలంలో నిమ్మ పండ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరటి తోట లోని నిమ్మ చెట్టు పుష్కలంగా కాయలు కాయాలంటే.. సరైన పోషణ, సంరక్షణ ముఖ్యం. ఎండల తీవ్రత పెరిగినపుడు నిమ్మ చెట్టు కు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కాయలు రాలకుండా మంచి దిగుబడి రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.

ఉష్ణోగ్రత లు పెరిగినపుడు భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. నేల పూర్తిగా ఎండిపోక ముందే నీరు పెట్టాలి.ఐతే మరీ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉదయం ఎండ రాకముందు ,సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే నీరు పెట్టడం మంచిది. దీని వల్ల వేర్లు చల్లగా ఉంటాయి. ఎండ దెబ్బ నుండి వేర్లను కాపాడటానికి మొక్కల మొదళ్ల దగ్గిర మల్చింగ్ చేయడం మంచిది.చెట్టు మొదలు చుట్టూ ఎండు గడ్డి , ఎండిన ఆకులు , కొబ్బరి పీచుతో 3-4 అంగుళాల మేర కప్పితే..వేర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. నేలలో తేమ ఎక్కువ సేపు ఉంటుంది కూడా.. నేలకు తగిలేలా ఉండే కింది కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది. ఇక నిమ్మలో పూత రాలకుండా ఉండటానికి , కాయల పరిమాణం పెరగడానికి .. ఒక లీటర్ నీటిలో 2గ్రా బోరాన్ ,5 గ్రా జింక్ సల్ఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.ఇంట్లో మిగిలిన పుల్లని పెరుగుతో మజ్జిగ చేసి , నిమ్మ చెట్టు మొదట్లో పోయాలి.చెట్టుపై పిచికారీ చేసినా.. శిలీంధ్ర తెగుళ్లు తగ్గుతాయి..

15, మే 2026, శుక్రవారం

ఈ - ట్రాక్టర్ రైతులకు ఉపయోగకరము

 


తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సి ఎస్ ఐ ఆర్ సీఎం ఈ ఆర్ ఐ ప్రిమాఈటీ 11 అనే స్వదేశీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను అభివృద్ధి చేసింది గురువారం హైదరాబాదులోని ఎన్జీఆర్ఐ లో ఈ ట్రాక్టర్ ను ప్రమోట్ చేయడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఎం జి ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ సీఎం ఈఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర మురుములతో కలిసి ట్రయల్ రన్ రోడ్ షో న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడిచే ఏ ట్రాక్టర్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు పొలాలలో ఈ ట్రాక్టర్ సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు తక్కువ వైబ్రేషన్ ఉండడం వల్ల మహిళలు సైతం సునాయాసంగా నడపగల వాహనం ఇది అని వివరించారు 26 హెచ్పీ సామర్థ్యం గల ఈ వాహనంలో 90 శాతం వరకు స్వదేశీ విడిభాగాలు ఉన్నట్లు తెలిపారు

1, మే 2026, శుక్రవారం

నిషేధిత పురుగుమందులను ఆన్లైన్లో విక్రయించవద్దు

 నిషేధిత పారాక్వాట్ సహా ఇతర పురుగుమందు లేవీ ఆన్లైన్లో విక్రయించరాదని ఈ కామర్శ సంస్థ అయిన అమెజాన్ ను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశించింది .గురువారం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ,అమెజాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు .ఈ కామర్స్ సంస్థల ద్వారా పురుగుమందుల విక్రయాలు, దానివలన ఏర్పడుతున్న అనర్ధాలపై చర్చించారు .

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మానవ ఆరోగ్యానికి హానికరమైన విషపూరిత పురుగుమందులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని, వాటిని ఆన్లైన్లో విక్రయించవద్దని అమెజాన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు .దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ వ్యవసాయ కమిషన్ సూచనలను పాటిస్తామని, తమ విక్రయాల జాబితా నుంచి నిషేధిత పురుగుమందులను తొలగిస్తామని చెప్పారు.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం

 ఫిబ్రవరి 27 28 మార్చి ఒకటి తేదీలలో కర్ణాటకలోని మైసూరులో దక్షిణ భారత కిసాన్ స్వరాజ్ సమ్మేళనం జరగనుంది. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో అలయన్స్ ఫర్ సస్టైనబుల్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ఆశా ఈ ఆరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవం జరుగుతుంది .2022 లోను మైసూరులోని జరిగిన సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారు .పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు కార్యకర్తలు శాస్త్రవేత్తలు వినియోగదారులను ఒకచోట చేర్చి అఖిలభారత అనధికారిక పౌర స్వచ్ఛంద సేవకుల సమ్మేళనం ఇది .ప్రకృతి ,సేంద్రియ వ్యవసాయ పద్ధతులు రైతుల హక్కులు ,దేశీ వంగడాలు ,వ్యవసాయ సంస్కృతి కలల పరిరక్షణ లక్ష్యంతో చర్చగోస్టులు ,సదస్సులు నిర్వహిస్తారు .విత్తన సార్వభౌమత్వం ,గడ్డి మందులను తట్టుకునే జన్యు మార్పిడి పంటలు, కలుపు యాజమాన్యం వ్యవసాయంలో శ్రమశక్తి ,అడవి జంతువులతో పంటలకు ముప్పును తట్టుకుని నిలబడడం ఎలా? ఇలాంటి అంశాలపై లోతైన చర్చ జరుగుతుంది. 

పాల్గొనదలచిన వారు..

 ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. మూడు రోజులకు వసతి ,భోజనం అన్నీ కలిపి రైతులు విద్యార్థులకు 1500 రూపాయలు, మహిళా రైతులకు 800 రూపాయలు ఇతరులకు 2500 నుండి 3500.

 చివరి తేదీ ..

ఫిబ్రవరి 15 ,2026 .

ఇతర వివరాలు ..810 55 798 39 

ఇమెయిల్.. kisanswarajsammelan2026@Gmail.com

హైదరాబాదులో రైతు బడి అగ్రి షో

 రైతులకు సరికొత్త నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేసే లక్ష్యంతో రైతు బడి అగ్రి షో పేరుతో భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనున్నది. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 20 21 22 తేదీలలో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు .తమ వ్యవసాయాన్ని నవీకరించుకోవాలి అనే   ఆలోచనతో ఉన్న రైతులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ షో నిర్వహిస్తున్నామన్నారు . 500కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని అనేక ప్రాంతాల నుంచి లక్ష మంది కి పైగా రైతులు ఈ కార్యక్రమాన్ని సందర్శించే అవకాశం ఉందని అన్నారు .

వివరాలకు 88971 19694.

www.rbagrishow.com

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE