వేసవికాలంలో నిమ్మ పండ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరటి తోట లోని నిమ్మ చెట్టు పుష్కలంగా కాయలు కాయాలంటే.. సరైన పోషణ, సంరక్షణ ముఖ్యం. ఎండల తీవ్రత పెరిగినపుడు నిమ్మ చెట్టు కు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కాయలు రాలకుండా మంచి దిగుబడి రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.
ఉష్ణోగ్రత లు పెరిగినపుడు భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. నేల పూర్తిగా ఎండిపోక ముందే నీరు పెట్టాలి.ఐతే మరీ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉదయం ఎండ రాకముందు ,సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే నీరు పెట్టడం మంచిది. దీని వల్ల వేర్లు చల్లగా ఉంటాయి. ఎండ దెబ్బ నుండి వేర్లను కాపాడటానికి మొక్కల మొదళ్ల దగ్గిర మల్చింగ్ చేయడం మంచిది.చెట్టు మొదలు చుట్టూ ఎండు గడ్డి , ఎండిన ఆకులు , కొబ్బరి పీచుతో 3-4 అంగుళాల మేర కప్పితే..వేర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. నేలలో తేమ ఎక్కువ సేపు ఉంటుంది కూడా.. నేలకు తగిలేలా ఉండే కింది కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది. ఇక నిమ్మలో పూత రాలకుండా ఉండటానికి , కాయల పరిమాణం పెరగడానికి .. ఒక లీటర్ నీటిలో 2గ్రా బోరాన్ ,5 గ్రా జింక్ సల్ఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.ఇంట్లో మిగిలిన పుల్లని పెరుగుతో మజ్జిగ చేసి , నిమ్మ చెట్టు మొదట్లో పోయాలి.చెట్టుపై పిచికారీ చేసినా.. శిలీంధ్ర తెగుళ్లు తగ్గుతాయి..