ఆయన రైతు. వ్యవసాయమంటే ప్రాణం. ఈ రంగంలో మరింతగా రాణించాలని ట్రాక్టర్ కొన్నారు. వ్యవసాయ పనులు అన్నీ ట్రాక్టర్ తో చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ట్రాక్టర్ తీసుకున్న నాటి నుంచి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. దీంతో ఆయనకు ట్రాక్టర్ తో అనుబంధం బలపడింది. ఆ అభిమానంతో తన ముగ్గురు పిల్లలకు ట్రాక్టర్ల పేర్లే పెట్టుకున్నాడు ఆ రైతు. ఇది ట్రాక్టర్ పై ఆయనకున్న ప్రేమ తెలుపుతోంది.
బీర్కూర్ మండలం బొమ్మన్ దేవన్ పల్లి గ్రామానికి చెందిన ఆకుల రాములుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు పిల్లలకు స్వరాజ్, మహీంద్రా, సోనాలికా అని ట్రాక్టర్ల పేర్లు పెట్టుకున్నాడు రాములు. అలా తన కుటుంబానికి ఆర్థిక బలాన్నిచ్చిన ట్రాక్టర్ల పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఆలోచన ఇలా వచ్చింది..
రాములు 1993 లో స్వరాజ్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు.ఆయనకు 8 ఎకరాల భూమి ఉంది. ట్రాక్టర్ సాయంతో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించాడు.ఆయన తన మొదటి కుమారుడి పేరు "స్వరాజ్" అని నామకరణం చేశాడు. తర్వాత మహీంద్రా కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. తర్వాత ఆయనకు రెండో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి మహీంద్రా అని పేరు పెట్టాడు. ఆ తర్వాత సోనాలికా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అపుడు కూతురు పుట్టింది. ఆమెకు సోనాలికా అని నామకరణం చేశాడు. పిల్లలందరూ చక్కగా చదువులో రాణిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా ట్రాక్టర్ ఉపయోగిస్తున్నట్లు చెబుతూ , ఆ అభిమానంతోనే పిల్లలకు ట్రాక్టర్ల పేర్లు పెట్టుకున్నట్లు రాములు చెప్పారు. ట్రాక్టర్ తోనే పంటలు పండిస్తున్నానని, దుక్కి దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకు ట్రాక్టరే అన్ని రకాలుగా తనకు సహాయపడుతుందని , అందుకే ట్రాక్టర్ అంటే ఎంతో అభిమానం అని అంటాడు రాములు.