21, నవంబర్ 2026, శనివారం

చంద్రుని పై బంగాళా దుంప

 చంద్రుడి ధూళి ,మట్టి నమూనాలతో బంగాళదుంపల సాగు.. వర్మీ కంపోస్టు సహాయంతో జాబిల్లిపై సేద్యం సాధ్యమే.. భూమిపై పండిన పొటాటోలతో సమానంగా దిగుబడి.. పోషకాలు ..ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం ..చంద్రునిపై స్థిర నివాసం దిశగా కీలక ముందడుగు.. 

హాలీవుడ్ లో 2015 ల వచ్చిన" ది మార్షియన్"  సినిమాలో పరిశోధనల కోసం అంగారక గ్రహం పైకి వెళ్లిన వ్యోమగాముల బృందంలో ఒక సైంటిస్ట్ అనుకోని రీతిలో అక్కడే చిక్కుకొని పోతాడు .అక్కడి కఠిన పరిస్థితుల్లో బతకడానికి వీలుగా మార్సులోని మట్టిలో తన వ్యర్ధాలను కలిపి కొద్దిపాటి గింజలతో బంగాళదుంప సాగు చేస్తాడు. ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చేందుకు ఎంతో దూరం లేదు. మనకెంతో ఇష్టమైన జాబిల్లిపై మానవ నివాసాలను ఏర్పాటు చేయాలనే అంతరిక్ష పరిశోధనా సంస్థల కల నెరవేరే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.చంద్రుని ఉపరితలం పై ఉండే మట్టిని పోలిన కృత్రిమ మట్టి లూనార్ రేగోలిత్  సిమ్యులెంట్ లో బంగాళదుంపలను విజయవంతంగా పండించి ఒరేగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులకు అద్భుతం చేశారు. ఈ వివరాలు ఎన్ పీ జె  మైక్రో గ్రావిటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి .

30% తో అద్భుతమైన ఫలితాలు.. చంద్రుని ఉపరితలంపై ఉండే ధూళి, రాళ్లముక్కల పొరలను లూనార్ రేగోలిత్ అంటారు. ఇందులో సేంద్రియ పదార్థాలు దాదాపుగా ఉండవు. పైగా భారలోహాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఓఎస్యు వృక్షశాస్త్రం, మొక్కల చీడపీడల శాస్త్ర విభాగం సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఐమెరిక్ గోయర్ పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ హ్యాండీ ల బృందం వినూత్న ప్రయోగం చేపట్టింది. చంద్రునిపై వివిధ ప్రాంతాలలో ఉండే ఐదు రకాల కృత్రిమ మట్టి నమూనాలకు వానపాముల ద్వారా తయారయ్యే వర్మి కంపోస్టును వివిధ నిష్పత్తుల్లో కలిపి బంగాళాదుంపలను సాగు చేశారు. వర్మీ కంపోస్టు కలపని మట్టిలో మొక్కల వేర్లు దెబ్బతిని ఎదుగుదల పూర్తిగా కుంటుపడింది. ఐదు నుంచి 15% కంపోస్టు కలిపినప్పుడు మొక్కలు పాక్షికంగా కోల్కున్నాయి .అయితే 30% వర్మీ కంపోస్టు కలిపిన కృత్రిమ చంద్రుని మట్టిలో బంగాళదుంప మొక్కలు చక్కగా పెరిగి మంచి దిగుబడి ఇచ్చాయి. చంద్రుడి మట్టిలో ఉండే భారలోహాలను వర్మీ కంపోస్టు బంధించి మొక్కల వేర్లకు హాని కలగకుండా రక్షించిందని డాక్టర్ డేవిడ్ హ్యాండీ వివరించారు. ఈ పద్ధతిలో పండిన బంగాళాదుంపలు ఉత్తమ సహజ పోషక విలువలను ఏమాత్రం కోల్పోలేదని ,ఇవి తినడానికి సురక్షితమైనవి అని స్పష్టం చేశారు.

 బంగాళాదుంపలే ఎందుకంటే..

 నాసా చేపట్టిన ఆర్టిమిస్ మిషన్ ద్వారా భవిష్యత్తులో వ్యోమగాములు చంద్రుడు పై దీర్ఘకాలం బస చేయనున్నారు. ప్రతిసారి భూమిపై నుంచి ఆహారాన్ని పంపడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ కేలరీలు పోషకాలను అందించే పంటగా బంగాళాదుంపలను గుర్తించారు. ఇదే అంతరిక్ష యాత్రలకు అత్యుత్తమ ప్రధాన ఆహారమని ప్రొఫెసర్ గోయర్ పేర్కొన్నారు. కొద్దిగా వర్మీ కంపోస్టు వెంట తీసుకెళ్తే చాలు. చంద్రుడి పైకి వెళ్ళిన తర్వాత ఆహార మొక్కలు, వ్యర్ధాలతో చంద్రుని పైనే వర్మీ కంపోస్టులు తయారు చేసు కుంటూ పంట పండించుకోవచ్చు అన్నారు. ప్రస్తుతం చంద్రుని మట్టిలో సాగుకు అత్యంత అనుకూలమైన పది బంగాళదుంప వంగడాలను గుర్తించే పనిలో ఈ బృందం హిమగ్నమైంది. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE